Matthew 10

యేసు పన్నెండు మందిని పంపించడం (మార్కు 6:7-13. లూకా 9:1-6)

1ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు.

2ఆ పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఇవి. మొట్ట మొదటిగా పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ, జెబెదయి కొడుకు యాకోబు, అతని సోదరుడు యోహాను. 3ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరి మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, 4కనానీయుడు సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.

5యేసు ఆ పన్నెండు మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, “మీరు యూదేతరుల ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు. సమరయ ప్రాంతంలోని ఏ ఊరిలోకీ వెళ్ళొద్దు. 6ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి. 7వెళుతూ, ‘పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది’ అని ప్రకటించండి.

8రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టరోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.

9
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Mat 10:10.
In this translation, this verse contains text which in some other translations appears in verses Mat 10:9-Mat 10:10.
10బంగారం, వెండి, ఇత్తడి, ప్రయాణం కోసం పెట్టె, రెండు అంగీలు, చెప్పులు, చేతికర్ర, ఇవేవీ మీ సంచిలో ఉంచుకోవద్దు. ఎందుకంటే పనివాడు తన ఆహారానికి అర్హుడు.

11మీరు ఏదైనా పట్టణంలో లేదా ఊరిలో ప్రవేశించినప్పుడు దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి. అక్కడ నుండి వెళ్ళే వరకూ అతని ఇంట్లోనే అతిథిగా ఉండిపొండి. 12ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటివారికి శుభం పలకండి. 13ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని పైకి వస్తుంది. దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకు తిరిగి వచ్చేస్తుంది.

14ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ మాటలు వినకపోతే మీరు ఆ ఇంటిని గానీ ఆ ఊరిని గానీ, విడిచి వెళ్ళిపోయేటపుడు మీ పాదధూళి దులిపి వేయండి. 15తీర్పు దినాన ఆ పట్టణానికి పట్టే గతి కంటే సొదొమ గొమొర్రా నగరాల గతి నయంగా ఉంటుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.

16 రానున్న గడ్డు రోజులు

16“తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి. 17మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. 18వీరికీ యూదేతరులకూ సాక్షార్థంగా నాకోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరకీ రాజుల దగ్గరకీ తెస్తారు.

19వారు మిమ్మల్ని అప్పగించేటపుడు, ‘ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?’ అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు. 20మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు.

21సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కొడుకునూ చావుకు అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు. 22నా నామాన్ని బట్టి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరి వరకూ సహించే వారిని దేవుడు రక్షిస్తాడు.

23వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తుంటే వేరే పట్టణానికి పారిపొండి. మనుష్య కుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు పట్టణాలు అన్నిటికీ వెళ్ళి ఉండరు అని మీతో కచ్చితంగా చెబుతున్నాను.

24గురువు కంటే శిష్యుడూ యజమాని కంటే పనివాడూ గొప్పవారేమీ కాదు. 25శిష్యుడు తన గురువు లాగా, పనివాడు తన యజమానిలాగా ఉంటే చాలు. ఇంటి యజమానికి బయెల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉంటే అతని ఇంటివారిని మరి ఇంకెంతగా అంటారో గదా!

26కాబట్టి మీరు వారికి భయపడవద్దు. కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు. 27మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవిలో వినిపించేది మేడలమీద చాటించండి.

అభయం

28“ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి. 29రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు. 30మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు. 31కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు.

32మనుషుల ముందు నన్ను ఒప్పుకొనే వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ ఒప్పుకుంటాను. 33ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదంటాడో వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ తెలియదంటాను.

శిష్యుడు చెల్లించవలసిన వెల

34“నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తిని తేవడానికే వచ్చాను గానీ శాంతిని కాదు. 35అంటే ఒక మనిషికి అతని తండ్రితో, కూతురికి తన తల్లితో, కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను. 36ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు.

37నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు. 38తన సిలువను భుజాన వేసుకుని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు. 39తన ప్రాణం దక్కించుకొనేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు.

40మిమ్మల్ని చేర్చుకొనేవాడు నన్ను చేర్చుకొంటాడు. నన్ను చేర్చుకొనేవాడు నన్ను పంపిన ఆయనను చేర్చుకొంటాడు. 41ప్రవక్త అని ఒక ప్రవక్తను చేర్చుకొనేవాడు ప్రవక్తకు దక్కే ప్రతిఫలం పొందుతాడు. నీతిమంతుడని ఒక నీతిమంతుణ్ణి చేర్చుకొనేవాడు నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు.

శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని కచ్చితంగా చెబుతున్నాను.”

42

Copyright information for TelULB